BEWARE OF JOB ALERTS - G KRISHNAKANTH IPS - Kurnool SP

Kurnool police

ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి…….కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు.

ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఖాళీ సమయాలలో పనిచేసి అదనపు ఆదాయం ఆర్జించమంటూ ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలకు ప్రజలు గురికాకుండా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని కొందరు వ్యక్తులు పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని , కానీ ప్రాసెస్సింగ్, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని నమ్మబలికి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తారని, కొందరు అయితే ఏకంగా ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహించి, ప్రాంగణ ఎంపికలు చేసేలా నటించి, సొమ్ము అందగానే పత్తా ఉండరని, అలాగే ఉద్యోగులు, అలాగే గృహిణిలు ఇంటి వద్దే ఉంటూ ఖాళీ సమయాలలో పనిచేస్తూ అదనపు ఆదాయం సంపాదించండి” వంటి ఆకట్టుకునే ప్రకటనలు చూసి ఆర్థిక కష్టాలు కొంతైనా తీరతాయని నమ్మి మోసపోతారని, నిరుద్యోగులు జాబ్‌ పోర్టల్స్ లో రెజ్యూమెలు అప్‌ లోడ్‌ చేస్తుంటారని,

ఇదే అదునుగా భావించిన సైబర్‌ నేరగాళ్లు అప్‌లోడ్‌ చేసిన రెజ్యూమ్ ల నుంచి వివరాలను సేకరించి వారికి తరచూ ఫోన్‌లు చేస్తూ సంభాషణలు కొనసాగిస్తారని, రిజిస్ట్రేషన్‌ పేరిటగానీ లేక మరేదైనా కారణం చెప్పి తమ వ్యక్తిగత ఖాతాలో డబ్బులు జమ చేయమని మభ్యపెడతారని, అలా జమచేసిన వారు డబ్బు కోల్పోతారని, ఎలాంటి జాబ్ రాకపోగా డబ్బు తిరిగి రాదని అన్నారు.

కంపెనీలు అధికారిక వెబ్‌సైట్లలోనే ఉద్యోగ ఖాళీల వివరాలను, అవసరాలను పొందుపరుస్తాయన్నారు. ఉద్యోగ ప్రకటన వెబ్సైట్ సరైనదో కాదో క్షుణ్నంగా పరిశీలించుకోవాలని, అందులో పేర్కొన్న మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తీసుకోకూడదని, స్వయంగా కార్యాలయాన్ని సంప్రదించాలని, అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయని సూచించారు.
ఏ సంస్థ/కంపెనీ ఐనా జీతాలు ఇచ్చి ఉద్యోగుల్ని నియమించుకుంటాయి కానీ డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వవనే అనే లాజిక్ కి గుర్తించాలన్నారు.

“నేను వెళ్లేది పని చేయడానికి.. మరి అలాంటప్పుడు నేనెందుకు డబ్బు చెల్లించాలి? అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని, బ్యాంక్‌ అకౌంట్స్, టాక్స్‌ ఫామ్స్, పాన్‌ నెంబర్, ఆధార్‌ కార్డ్‌.. లాంటివాటిని అడుగుతున్నారంటే అనుమానించాలని, అపరిచితులకు డబ్బులు బదిలీచేసే ముందు తార్కికంగా ఆలోచించాలని హెచ్చరించారు.

ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైన ఈ తరహా మోసానికి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి లేదా సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చెయ్యాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు జిల్లా ప్రజలకు తెలియజేశారు.